: మహిళా కోటా తెచ్చిన చిచ్చు... పదవికి రాజీనామా చేస్తానన్న నాగాలాండ్ సీఎం

స్థానిక సంస్థల్లో మహిళలకు కోటా వివాదం నాగాలాండ్‌ ముఖ్యమంత్రి టీఆర్‌ జెలియాంగ్‌ పదవికి ఎసరు తెచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంపై గిరిజన నేతలకు సర్దిచెప్పలేక తలపట్టుకున్న జెలియాంగ్ వారి ఒత్తిడికి తలొగ్గి పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. నాగా గిరిజన తెగల్లో పురుషాధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి స్థానిక సంస్థల్లో మహిళల కోటాను అమలు చేసేందుకు ఆయన నడుంబిగించారు. దీనిని అంగీకరించని గిరిజన తెగలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా గిరిజనులు, పోలీసులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు గిరిజనుల్ని పోలీసులు కాల్చి చంపారు. దీంతో వివాదం ముదిరిపోయింది. గిరిజనులు రెచ్చిపోయారు. నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు.

శుక్రవారంలోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీంతో తన పదవికి రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేస్తానంటూ నాగాలాండ్‌ ట్రైబల్‌ యాక్షన్‌ కమిటీ (ఎన్‌టీఏసీ) కన్వీనర్‌ కేటీ విల్లేకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అధికార నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) శాసనసభాపక్షం సమావేశమై, శాసనసభా పక్షనేతగా పార్టీ అధ్యక్షుడు షుర్తోజెలీ లీజీత్సును ఏకగ్రీవంగా ఎన్నుకుంది. త్వరలోనే ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. 60 మంది శాసనసభ్యులున్న నాగాలాండ్ లో ప్రజాస్వామ్య కూటమి (డీఎన్‌ఏ) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇందులో 46 మంది ఎన్పీఎఫ్‌, నలుగురు బీజేపీ, 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్సీపీ, జేడీయూలకు చెరోసభ్యుడు ఉన్నారు. 

More Telugu News