: హైదరాబాదీయులూ జాగ్రత్త... వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేస్తున్నారా?

హైదరాబాదులోని ఏ సందులో చూసినా ఇంటి బయట ద్విచక్రవాహనాలు పార్క్ చేసి ఉంటాయి. అలాగే రోడ్డు మీదే కార్లు పార్కు చేసి ఉంటాయి. అయితే, ట్రాఫిక్ నియంత్రణకు నడుం బిగించిన జీహెచ్ఎంసీ సరికొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆరు బయట వాహనాలను పార్కింగ్ చేస్తే నెలవారీ జరిమానా చెల్లించాల్సి వుంటుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక విధాన రూపకల్పనకు నడుం బిగించింది. కాలనీల్లోని రోడ్లపై పార్క్‌ చేసే వాహనాలను బట్టి సదరు ఇళ్ల యజమానుల నుంచి నిర్ణీత మొత్తాన్ని పార్కింగ్‌ ఫీజుగా వసూలు చేయాలని భావిస్తోంది.

దీని విధి విధానాల ఖరారుకు జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ సూచించిన రీతిలో భాగంగా తొలుత కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు ఈ చార్జీలను వర్తింపజేస్తామని చెప్పిన జీహెచ్‌ఎంసీ, దానిని నెమ్మదిగా విస్తరిస్తామని పేర్కొంది. అలాగే తమ భవనాల్లో పబ్లిక్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చే వారికి పలు ప్రయోజనాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనుంది. ఇలాంటి వారికి ఆస్తిపన్నులో రాయితీ, అభివృద్ధి బదలాయింపు హక్కులో భాగంగా అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు కల్పించే అవకాశాలను పరిశీలించనుంది. 

More Telugu News