: పెద్ద మొత్తంలో నగదు జమ అయిన బ్యాంకు ఖాతాలపై ఐటీ కన్ను.. 9 లక్షల ఖాతాలపై అనుమానం!

డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో 18 లక్షల ఖాతాల్లో పెద్దమొత్తంలో నగదు జమ అయిందని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఇందులో సుమారు 9 లక్షల ఖాతాలపై అనుమానాలున్నాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం పలు ఖాతాల్లో 5 లక్షల రూపాయలకు పైబడిన మొత్తాలు డిపాజిట్ అయ్యాయి. దీంతో ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’ లో భాగంగా ఫిబ్రవరి 15 లోగా ఈ 5 లక్షల రూపాయలు ఎక్కడివి? ఎలా వచ్చాయి? వంటివాటికి సమాధానం ఇస్తూ, సంబంధిత సాక్ష్యాధారాలను సమర్పించాలంటూ ఐటీ శాఖ, బ్యాంకుల ద్వారా ఖాతాదారులకు ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిళ్లు పంపించింది.

ఇందులో ఫిబ్రవరి 12 వరకు తాఖీదులు పంపిన 18 లక్షల మంది బ్యాంకు ఖాతాదారుల్లో 5.7లక్షల ఖాతాలకు సంబంధించి ప్రత్యుత్తరాలు వచ్చినట్లు ఐటీ శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లధన ఆదాయ వెల్లడి పథకం 'ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన' గడువు మార్చి 31 వరకు ఉన్న నేపథ్యంలో, ఈ పథకం గడువు ముగిసిన వెంటనే చర్యలకు దిగాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇందుకు సాక్ష్యాలు సమర్పించని, ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారిపై చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News