: చైనా హెచ్చరికలకు సరైన సమాధానమిచ్చేందుకు సిద్ధమవుతున్న భారత్!

చైనాకు దీటైన సమాధానం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ పై ఐక్యరాజ్యసమితి ద్వారా నిషేధాన్ని విధించే ప్రయత్నం చేసిన భారత్ ఆశలను, పలుమార్లు వమ్ము చేసిన చైనాకు దీటుగా జవాబు చెప్పే రీతిలో భారత్ పావులు కదుపుతోంది. వియత్నాంతో భారత్ బంధంపై చైనా ఆగ్రహంగా ఉంది. వియత్నాం నేతలతో సంప్రదింపుల ద్వారా భారత్ హద్దు మీరుతోందని, అమెరికా, జపాన్ వంటి దేశాలే చైనాకు వ్యతిరేక కార్యకలాపాలు చేయడం లేదన్న విషయం భారత్ గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వియత్నాం నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లతో కలిసి రాజకీయ నాయకులు పర్యటనకు వస్తున్నారని, రాజకీయ సంబంధాలపై చర్చలు జరిగే అవకాశం లేదని భారత్ ప్రకటన విడుదల చేసింది.

అయితే, గతంలో వియత్నాం రక్షణ కొనుగోళ్లకు 500 మిలియన్ల సాయం అందజేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు... వియత్నాంకు భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణులను విక్రయించనున్నట్టు తెలుస్తోంది. ఆకాశ్ క్షిపణులను విక్రయానికి ఉంచినట్టు డీఆర్డీఏ ప్రకటించింది. అయితే వీటి విక్రయం కేవలం వియత్నాంకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలకు కూడా విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు వివిధ దేశాలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతోంది. అయితే వియత్నాంకు భారత్ ఎన్ని ఆకాశ్ క్షిపణులను అందజేయనుందన్న విషయాన్ని వెల్లడించకపోవడం విశేషం. కాగా, ఆకాశ్ క్షిపణి రేంజ్ 30 కిలో మీటర్లు. భూఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలగడం దీని స్పెషాలిటీ. దీనిని తొలిసారి భారత్ 1990లో తయారు చేసింది. తరువాత పలుదశల్లో మరింత మెరుగ్గా, సమర్థవంతంగా దీనిని అభివృద్ధి చేసింది. 

More Telugu News