: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ నిరాకరణ

టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నెల్లూరు జిల్లా  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి కాకాని గోవర్దన్ రెడ్డికి పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసేందుకు జిల్లా కోర్టు నిరాకరించింది. దీంతో, హైకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తనపై ఆరోపణలు చేసిన కాకానిపై సోమిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే, ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది.

దీంతో, కాకానిపై కేసు నమోదు చేశారు. అయితే, తనను అరెస్ట్ చేయకుండా ఆయన షరతులతో కూడిన బెయిల్ ను తెచ్చుకున్నారు. పూర్తి స్థాయి బెయిల్ నిమిత్తం రెండు రోజుల క్రితం జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు విచారణ చేసిన కోర్టు, ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా, బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News