: ఆ ఐదుగురు విశ్వాసపాత్రులలో ఒకరు పళనిస్వామి!

కొంచెం సేపటి క్రితం తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి, విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లో అన్నాడీఎంకే పార్టీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎదిగారు. జయలలితకు విశ్వాసపాత్రులు అనదగిన వారు మొత్తం ఐదుగురు. వారిలో పన్నీర్ సెల్వం, నాథమ్ ఆర్. విశ్వనాథన్, వి.వైతిలి లింగ్, పి.పళనియప్పన్ తో పాటు, పళనిస్వామి కూడా ఉన్నారు. ఈ ఐదుగురు జయలలితకు అండగా ఉంటూ పార్టీని నడిపించడంలో ముందుండేవారని సమాచారం. పార్టీ తరపున రాజకీయపొత్తుల వ్యవహారాన్ని పళనిస్వామి చూసుకునేవారని, జయలలిత ఆదేశాల మేరకు తమ మిత్రపక్షాలతో చర్చలు జరిపేవారని సమాచారం.

గత ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు  పన్నీర్ సెల్వంను పక్కనపెట్టి.. పార్టీలతో పొత్తు వ్యవహారంపై చర్చల బాధ్యతను పూర్తి స్థాయిలో పళనిస్వామికే జయలలిత అప్పగించారట. పార్టీ కార్యకలాపాల్లో పళనిస్వామి విజయం సాధించడానికి ఆయన వెనుక తన సామాజిక వర్గం వారు ఉండటమేనని సమాచారం. పళనిస్వామి గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, జయలలిత మంత్రి వర్గంలో ఒక్కసారిగా కూడా వేటు పడని తక్కువ మంది మంత్రులలో ఆయన కూడా ఉండటం! 

More Telugu News