: ఆయన ఇచ్చిన తీర్పులు అప్పట్లోనూ ఇద్దరు శక్తిమంతులైన మహిళా సీఎంలను జైలుకు పంపించాయి!

ఆదాయానికి మించిన ఆస్తులు క‌లిగి ఉన్న కేసులో త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌తో పాటు స‌హ‌నిందితురాలిగా ఉన్న‌ శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్షను ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. చ‌ట్టంముందు ఎవ్వ‌రూ త‌ప్పించుకోలేర‌ని మ‌రోసారి రుజువు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు, గ‌తంలో జిల్లా జడ్జిగా ఉన్న‌ప్పుడు జడ్జి జాన్‌ మైఖేల్‌ కున్హా ఇచ్చిన వివరణాత్మక తీర్పే ప్రాతిపదిక అని చెప్పచ్చు . ఈ కేసులో జయలలిత, శశికళలకు జైలుశిక్ష విధిస్తూ 2014లో కున్హా తీర్పునిచ్చారు. ఆ తీర్పును సమర్థిస్తూనే నిన్న సుప్రీంకోర్టు శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష వేసింది. గ‌త ఏడాది వ‌ర‌కు జిల్లా జ‌డ్జిగా ఉన్న జాన్‌ మైఖేల్‌ కున్హా ఇప్పుడు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ప‌ని చేస్తున్నారు.
 
విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆయన, గతంలో ఇచ్చిన తీర్పులు ఇద్దరు శక్తిమంతులైన మహిళా ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లేలా చేశాయి. దీంతో వారు రాజీనామాలు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. జయలలితకు చెందిన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న‌ కేసును సుప్రీంకోర్టు 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేసింది. అయితే, కేసు మెల్లిగా ముందుకు సాగింది. చివ‌ర‌కు  సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఐదో జడ్జిగా జాన్‌ మైఖేల్‌ కున్హాను నియమించడంతో కేసు వేగంగా క‌ద‌ల‌డం ప్రారంభించింది. 2014 సెప్టెంబరు 27న అప్ప‌టి సీఎం జయల‌లిత‌ను ఆయ‌న‌ కోర్టుకు రప్పించి, నాలుగేళ్ల జైలు శిక్ష‌తో పాటు వంద కోట్ల జరిమానా విధించారు. ఇక అప్ప‌ట్లో జ‌య విధేయుడు పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే, అనంత‌రం జయలలితపై కేసును హైకోర్టు కొట్టేయడంతో మ‌ళ్లీ ఆమె సీఎం అయ్యారు.

మొద‌టి నుంచి అక్ర‌మార్కుల కేసుల‌ను వేగంగా విచార‌ణ జ‌రుపుతూ వ‌స్తోన్న జాన్‌ మైఖేల్‌ కున్హా 2004లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఉమాభారతి చేసిన త‌ప్పుకి కూడా శిక్ష విధించారు. ఈద్గా మైదానంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఆమె జెండా ఎగురవేసిన కేసులో ఆమెకు బెయిలు ఇవ్వ‌డానికి ఆయ‌న‌ నిరాకరించారు. 1994లో హుబ్లీలోని ఈద్గా మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేసులో 2002-04 మధ్య స్థానిక కోర్టు 18 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసినప్ప‌టికీ అప్ప‌ట్లో ఉమాభార‌తి ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లారు.

అయితే, తాను ముఖ్య‌మంత్రి అయ్యాక ఆ కేసు త‌న‌కు చిక్కులు తెచ్చిపెట్టొచ్చ‌ని భావించిన ఉమాభార‌తి ప్రభుత్వ న్యాయవాదుల సలహా మేరకు హుబ్లీ జిల్లా జడ్జిగా ఉన్న కున్హా ముందు హాజరయ్యారు. తనపై అభియోగాలను కొట్టేయాలని ఆయ‌న‌ను ఆమె కోరారు. కానీ కున్హా నో చెప్పేశారు. రెండేళ్ల క్రితం నాటి కేసులో అభియోగాలు కొట్టేయడం కుదరదని స్పష్టం చేశారు. ఆయ‌న తీసుకున్న ఆ నిర్ణ‌యంతో ఉమాభారతి అనంత‌రం జైలుకి వెళ్లి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. ఆ విధంగా ఆయన కేసులో వున్న వ్యక్తులు ఎవరన్నది పట్టించుకోకుండా, చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రానికి కట్టుబడివుంటారు! 

More Telugu News