: వైరల్‌గా మారిన 12 ఏళ్ల బాలిక లేఖ.. ‘సెవన్ సిస్టర్స్’ సంగతేంటంటూ ప్రధానికి ప్రశ్న!

అస్సాంకి చెందిన ఐరా గోస్వామి(12) రాజస్థాన్‌లోని జయపురలో చదువుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీకి ఈ చిన్నారి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అయింది. ‘సెవన్ సిస్టర్స్’గా ఖ్యాతిగాంచిన ఈశాన్య రాష్ట్రాల గురించి ఇప్పటికీ చాలామంది విద్యార్థులకు ఏమీ తెలియడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. చరిత్ర పుస్తకాల్లో అంతర్జాతీయ చరిత్ర, దాని గొప్పదనం గురించి పేజీల కొద్దీ వివరిస్తారని, కానీ ఈశాన్య రాష్ట్రాల  చరిత్ర  పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం తనను బాధిస్తోందంటూ ప్రధానికి మొరపెట్టుకుంది.

అస్సాంకు చెందిన తన పేరు ఐరా గోస్వామి అని లేఖ మొదలుపెట్టిన చిన్నారి తాను ప్రస్తుతం జయపురలోని నీర్జా మోదీ స్కూల్‌లో చదువుకుంటున్నట్టు పేర్కొంది. తనకు చరిత్ర పాఠాలంటే ఎంతో ఇష్టమని, మౌర్యులు, గుప్తులు, మొఘలుల చరిత్ర గురించి చదువుకున్నా కానీ సొంత రాష్ట్రం అస్సాం గురించి మాత్రం తెలియదని, తమ రాష్ట్రాన్ని పాలించిన వారి వివరాలు తనకు కొంచెం కూడా తెలియవని పేర్కొంది. సెవెన్ సిస్టర్స్‌గా పేరుగాంచిన అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించిన చరిత్ర ఏదీ పుస్తకాల్లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరికైతే సెవెన్ సిస్టర్స్ అంటే కూడా ఏమిటో తెలియదని పేర్కొంది. వాటికి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని కోరుతున్నట్టు లేఖలో పేర్కొంది. ఇప్పుడీ లేఖ వైరల్‌గా మారింది.

More Telugu News