: ఎయిర్ పోర్టులో హత్యకు గురైన ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరుడు!

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ సవతి సోదరుడు కిమ్‌ జోంగ్‌ నాం (45) మలేసియాలోని ఎయిర్ పోర్టులో హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన కిమ్ జోంగ్ నాంను వారి తండ్రి కింమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలు గమనించిన నాం 2001లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో జపాన్ లో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కావడంతో అమెరికా వెళ్లి కొంత కాలం జీవించాడు. అక్కడ సురక్షితం కాదని భావించిన కింమ్ జోగ్ నాం చైనాలోని మకావు ప్రాంతంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు.

 ఈ నేపథ్యంలో మలేసియా వస్తూ కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో దిగిన కిమ్ జోంగ్ నాంకు ఎయిర్ పోర్టులోనే గుర్తు తెలియని ఇద్దరు మహిళా ఏజెంట్లు విషపు ఇంజెక‌్షన్లు ఇచ్చి మరుక్షణమే మాయమయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన మరణించాడని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుల ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. కాగా, ఇది కిమ్ జోంగ్ ఉన్ పనేనని అనుమానిస్తున్నారు. 2013లో తన మామ అయిన జాంగ్‌ సాంగ్‌ థెక్‌ కు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 

More Telugu News