: కోహ్లీతోనే ముప్పు...ఆ దూకుడికి కళ్లెం వేసే ప్రణాళికలున్నాయి: స్మిత్

కెరీర్ లోనే అత్యుత్తమ ఫాంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోనే తమకు పెను ముప్పు పొంచి ఉందని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ముంబైలో మీడియాతో మాట్లాడిన స్మిత్, భారత్ తో సిరీస్ లో రాణిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచించిన తర్వాతే తాము భారత్ లో అడుగుపెట్టామని చెప్పాడు. భారత జట్టు అత్యుత్తమంగా ఆడుతోందని గుర్తుచేశాడు. భారత్ కు గట్టి పోటీ ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచ ఆటగాళ్లలో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని, వరుసగా నాలుగు సిరీస్ లలో డబుల్ సెంచరీ సాధించడం అసాధారణమైన విషయమని, అసాధ్యాన్ని కోహ్లీ సుసాధ్యం చేశాడని, అలాంటి ఆటగాడిని కట్టడి చేయడం సవాలేనని తెలిపాడు.

కేవలం కోహ్లీ మాత్రమే కాకుండా టీమిండియాకు టాప్ 6 బ్యాట్స్ మన్ అభేద్యమైన ఆటగాళ్లని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరూ మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాళ్లేనని చెప్పాడు. వీరందర్నీ నిరోధించేందుకు సరిపడ ప్రణాళికలతో తాము భారత్ లో అడుగుపెడుతున్నామని స్మిత్ తెలిపాడు. కాగా, ఉపఖండంలో పిచ్ లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు యూఏఈ, సౌదీ అరేబియాల్లో సాధన చేసిన సంగతి తెలిసిందే. అలాగే సిరీస్ కు మూడు వారాల ముందే భారత్ లో అడుగుపెట్టింది. దీంతో భారత్ ను భారత్ లో ఓడించాలన్న లక్ష్యం ఆసీస్ ఆటగాళ్లలో బలంగా కనిపిస్తోంది. కాగా, ఆసీస్ ఆటగాళ్లలో అత్యధికులకు భారత్ లోని పిచ్ లపై ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్ లో ఆసీస్ జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

More Telugu News