: పన్నీర్ లాంటి వాళ్లని వెయ్యిమందిని చూసుంటా.. దువ్వెన దాస్తే పెళ్లి ఆగిపోతుందా?.. శశికళ ఘాటు వ్యాఖ్యలు

పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి వాళ్లను వెయ్యిమందిని చూసుంటానని పేర్కొన్నారు. దువ్వెన దాచినంత మాత్రాన పెళ్లి ఆగిపోదన్నారు. ఎంతమంది మగాళ్లు వచ్చినా ఎదుర్కొనే దమ్ము తనకుందన్నారు. పన్నీర్ సెల్వం(ఓపీఎస్)తో డీఎంకే కుమ్మక్కయిందని, అందుకే తాను రంగప్రవేశం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితులకు పూర్తిగా బీజేపీ, డీఎంకేలో కారణమని ఆరోపించారు.
 
సోమవారం ఉదయం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన శశికళ.. తాను సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయి ఉండేదాన్నన్నారు. తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని పేర్కొన్నారు. పదవులు తనకు గోధూళితో సమానమన్నారు. అయితే ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఓపీఎస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసిన తనకు, డీఎంకేకు ఓపీఎస్ సహకరిస్తున్నట్టు అర్థమైందన్నారు. అందుకే పార్టీని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నానని వివరించారు. ప్రాణాలు పోయినా పార్టీని నిలబెట్టుకుంటానని శశికళ స్పష్టం చేశారు. ఓపీఎస్ ద్రోహి అని, వెన్నుపోటుదారుడని పేర్కొన్న శశికళ అతడిని ఎలా ఎదుర్కోవాలో ‘అమ్మ’ దగ్గర నేర్చుకున్నానని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలబెడతానని, అసెంబ్లీలో అమ్మ చిత్రపటాన్ని ఆవిష్కరించి తీరుతానని పునరుద్ఘాటించారు.
 

 
 

More Telugu News