: పాజిటివ్ గా రాసిన వారిని అభినందిస్తున్నా.. నెగిటివ్ గా రాసిన వారిని వదిలిపెడుతున్నా: చంద్రబాబు

అమరావతిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు బ్రహ్మాండంగా జరిగిందని, ఈ సదస్సుకు స్పందన బాగా వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సదస్సు విజయవంతానికి కృషి చేసిన స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రభుత్వ అధికారులకు తన ధన్యవాదాలని అన్నారు. అదే విధంగా, ‘పాజిటివ్ గా వార్తలు రాసిన వారిని అభినందిస్తున్నా.. నెగిటివ్ గా వార్తలు రాసిన వారిని ఏమంటాం!.. వదిలిపెడుతున్నా’ను అని చంద్రబాబు  అన్నారు.

తాము ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షానికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పెడితే ‘తుని’ సంఘటనకు పాల్పడ్డారని, రాష్ట్ర  ప్రతిష్ట, గవర్నమెంట్ ప్రతిష్ట పోగొట్టారని ఆయన మండిపడ్డారు. మొన్న ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహిస్తే.. ‘జల్లికట్టు’ తరహాలో పోరాడండి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, ఆ రోజు పోలీసులు బాగా పని చేశారని, లేకపోతే, పదిలక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవి కావని, రాష్ట్రం అభాసు పాలయ్యేదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవారని అన్నారు. అదే మాదిరిగా తిరుపతిలో నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే, అక్కడ కూడా ప్రతిపక్షాలు అడ్డుపడాలని చూశాయని, అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహిస్తే.. దానినీ అభాసుపాలు చేయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు.

More Telugu News