: అక్రమాస్తుల కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు!

జయలలిత అక్రమాస్తుల కేసులో రెండవ నిందితురాలిగా శశికళ ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుపై రేపు ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. కాగా, రూ.66 కోట్ల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయలలిత మొదటి ముద్దాయి. కాగా, రెండో ముద్దాయిగా శశికళ ఉన్నారు. చెన్నై, బెంగళూరులో ఈ కేసు పద్దెనిమిది సంవత్సరాల పాటు నడిచింది. 2014లో ఈ కేసుపై బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చింది. జయలలితకు రూ.100 కోట్లు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష; శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించింది.

కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన జయలలిత, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి, బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేయడంతో వారు నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే పార్టీలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కేసుపై రేపు సుప్రీం తీర్పు వెలువరించనుంది. అయితే, ఈ కేసు తీర్పు వెలువడక ముందే జయలలిత మృతి చెందడంతో, ఆ కేసు నుంచి ఆమె పేరును తొలగించాలని సుప్రీంకోర్టును కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కోరింది.

More Telugu News