: ట్రంప్ స్పందనను చూడ్డానికే ఉత్తరకొరియా ఈ చర్యకు పాల్పడింది: దక్షిణకొరియా

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే వ్యూహాత్మక బాలిస్టిక్ మిస్సైల్ పుగుక్ సాంగ్-2ను విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా స్పష్టం చేసింది. న్యూక్లియర్ వార్ హెడ్ ను మోసుకెళ్లగలిగే ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం పట్ల తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆనందంగా ఉన్నారని ఆ దేశ న్యూస్ ఏజన్సీ తెలిపింది. దీని ప్రయోగానికి ఘన ఇంధన ఇంజిన్ వాడారని... దీంతో, క్షిపణికి మరింత ఎక్కువ శక్తి, పరిధి వచ్చిందని చెప్పింది.

ఈ క్షిపణి ప్రయోగం పట్ల దక్షిణకొరియా మండిపడింది. ఈ ప్రయోగాలతో ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఈ ప్రయోగం జరిపారని తెలిపింది. తూర్పు దిశగా జపాన్ వైపు 500 కిలోమీటర్ల దూరం ఈ క్షిపణి ప్రయాణించిందని చెప్పింది. వాస్తవానికి, ఈ క్షిపణి రేంజ్ మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ... అది జపాన్ లోకి దూసుకెళ్లే ప్రమాదం ఉండటంతో, తక్కువ దూరానికే ప్రయోగాన్ని పరిమితం చేశారని వెల్లడించింది.

మరోవైపు, ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను నాటో కూడా తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలను ఉత్తరకొరియా మానుకోవాలని... అంతర్జాతీయ సమాజంతో అర్థవంతమైన చర్చలను జరపాలని సూచించింది. ఉత్తరకొరియా పదేపదే ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం సహించరానిదంటూ యూరోపియన్ యూనియన్ మండిపడింది. ఉత్తరకొరియా మిత్రదేశం చైనా మాత్రం ఈ ప్రయోగంపై ఇంతవరకు స్పందించలేదు.

More Telugu News