: మోదీలో అతిపెద్ద లోపం ఇదే: పవన్ కల్యాణ్

ఇండియాను అత్యుత్తమంగా నడిపిస్తాడని తాను ఊహించిన నరేంద్ర మోదీ, విఫలమౌతున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. పేదల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, ధనికుల విషయంలో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నాయని నిప్పులు చెరిగారు. చట్టాలు బలహీనుడిపై బలంగా, బలవంతుడిపై బలహీనంగా ఉండటం ఇండియాలోని దౌర్భాగ్యమని చెప్పారు. పవన్ ఈ మాటలు చెప్పగానే హార్వార్డ్ ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమోగింది.

ఈ పరిస్థితులను చూసి ఎంతో ఆందోళన చెందానని, ఇండియాలో 1980 ప్రాంతంలో ఇదే తరహా పరిస్థితి తనకు కనిపించిందని పవన్ చెప్పుకొచ్చారు. ఓ వైపు పెట్టుబడిదారీ విధానం, మరోవైపు కమ్యూనలిజం, ఇంకో వైపు సోవియట్ సోషల్ రిపబ్లిక్ పనిచేస్తున్న రోజుల్లో భారత భవిష్యత్తుపై ఆందోళనగా ఉండేదని అన్నారు. తన ఇంట్లోని వైరుధ్యంతో తనకెంతో అయోమయంగా ఉండేదని, ఏ సిద్ధాంతాలతో సాగాలో తెలిసేది కాదని చెప్పారు. కనీసం సినిమాల్లోనైనా తన ఉద్దేశాలను చూపాలని భావించి, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రయత్నించి విఫలమైనానని అన్నారు. విభిన్న సినిమాలు చేసినా సంతృప్తి కలగలేదని పవన్ తెలిపారు.

భారతీయ సమాజానికి ఉన్న విభిన్న పార్శ్వాలు తనను రాజకీయాలవైపు అడుగులు వేసేలా చేశాయని జనసేనాని చెప్పుకొచ్చారు. స్పందన లేని సమాజం, విభజనవాదాలు తనకు నచ్చని విషయాలని, చిన్నప్పటి నుంచి విభజనలను చూస్తూనే పెరిగానని అన్నారు. తన తండ్రి బదిలీ అయి కొత్త చోటికి వెళితే, తన మాండలికం నుంచి స్నేహితుల వరకూ మారిపోయేవారని, ప్రతి చోటా తనను పరాయి వాడిగా చూసేవారని చెప్పారు. తెలుగునే తీసుకుంటే, ప్రతి 100 కిలోమీటర్లకూ భాష మారిపోతుండేదని, అది తన మనసులో బలంగా నాటుకుపోయిందని అన్నారు.

More Telugu News