: అధికారం కోసం భారీ స్కెచ్ రూపొందిస్తున్న శశికళ!

మూడు రోజుల నాడు తన శిబిరంలో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలను చూపించినప్పటికీ, ఒక్కొక్కరూ జారిపోతూ ఉండటం, మరోవైపు ప్రజల్లో పన్నీర్ సెల్వంకు మద్దతు పెరిగిపోతున్న తరుణంలో ఇక ప్రత్యక్ష పోరాటానికి దిగాలని శశికళ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పెద్దలను విమర్శించాలంటే, ఆచితూచి అడుగులు వేసిన ఆమె, ఇప్పుడు స్వరం పెంచి, గవర్నర్ విద్యాసాగర్ రావుపై డైరెక్టుగానే విమర్శలు గుప్పించారు. ఆయన కావాలనే తన ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారని నిప్పులు చెరిగారు.

ఇక సాధ్యమైనంత త్వరగా సీఎం పీఠాన్ని ఎక్కాలని భావిస్తున్న ఆమె, భారీ స్కెచ్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నేటి సాయంత్రం నుంచి అందుకు కార్యాచరణ ప్రారంభం కానుందని శశికళ వర్గం నుంచి సమాచారం అందుతోంది. నేడు విద్యాసాగర్ రావును కలిసేందుకు శశికళ అపాయింట్ మెంట్ కోరగా, ఇప్పటివరకూ రాజ్ భవన్ నుంచి సమాచారం రాలేదు. దీంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని భావిస్తున్న శశికళ, సాయంత్రం 4 గంటల వరకూ వేచి చూసి, ఆపై తన వర్గం ఎమ్మెల్యేలతో బస్సుల్లో ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్లి పరేడ్ పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అప్పటికీ పని కాదని భావిస్తే, వారందరితో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి, జాతీయ స్థాయిలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలని శశి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ నుంచి రాగానే మెరీనా బీచ్ లో నిరాహార దీక్షకు దిగాలని శశికళ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిరాహార దీక్షకు దిగితే, మహిళల నుంచి మద్దతు పొందవచ్చని ఆమె అంచనాగా తెలుస్తోంది. ఆపై నియోజకవర్గాల వారీగా తన మద్దతుదారులతో నిరసనలకు దిగాలని ఆమె నుంచి ఆదేశాలు వెళ్లినట్టు పోలీసులకు సమాచారం అందడంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శశికళకు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో నేటి సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

More Telugu News