: విదేశీయులే లక్ష్యంగా, 'ట్రంప్ శకం' దాడులు మొదలు, వందల మంది అరెస్ట్... ఆందోళనలో భారతీయులు!

సరైన పత్రాలు లేవని ఆరోపిస్తూ, వందలాది మంది విదేశీయులను అమెరికన్ అధికారులు అదుపులోకి తీసుకుంటుండటంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత దాడులకు తొలిసారిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫెడరల్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీ అధికారులు లాస్ ఏంజిలస్, న్యూయార్క్, చికాగో, ఆస్టిన్, అట్లాంటా తదితర నగరాల్లో దాడులు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారందరినీ దేశం నుంచి పంపించి వయాలన్నదే వీరి లక్ష్యంగా తెలుస్తోంది. కాగా, దాడులు సర్వసాధారణమేనని, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని ఐసీఐ అధికారి జెన్నిఫర్ ఎల్జియా వెల్లడించారు. నిత్యమూ ఎక్కడో ఒకచోట ఈ తరహా దాడులు చేసి సరైన పత్రాలు లేకున్నా, వీసా ముగిసినా అమెరికాలో ఉన్నా అరెస్ట్ లు చేస్తుంటామని ఆమె అన్నారు.

కాగా, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా ప్రాంతంలో 160 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఐసీఈ హెడ్ డేవిడ్ మారిన్ తెలిపారు. మెక్సికో నుంచి వచ్చిన 37 మంది వలసవాదులను అరెస్ట్ చేశామని అన్నారు. అసలు అమెరికాలో బయట తిరిగేందుకు భయపడే పరిస్థితి నెలకొందని, ఏ పోలీసు చూసి ఏం అడుగుతాడోనన్న ఆందోళన నెలకొందని ఓ ఇండియన్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, అమెరికాలో 1.1 కోట్ల మంది సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నట్టు అధికార అంచనాలు వెల్లడిస్తున్నాయి.

More Telugu News