: చెన్నైలో హై టెన్షన్... పన్నీర్ ఇంటి ముందు వందల నుంచి వేలల్లోకి అభిమానులు!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న వీకే శశికళ వెనుక ఓ 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు మినహా మరెవరూ లేరా? తమిళనాడులో పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రోజురోజుకూ పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన వెంట 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుండగా, ప్రజలు భారీ ఎత్తున పన్నీర్ ఇంటికి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. నిన్న మొన్న వందల సంఖ్యలో ఆయన ఇంటి ఎదుట ఉన్న అభిమానులు, ప్రజల సంఖ్య, నేడు వేలల్లోకి చేరిపోయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తమిళనాడుకు చేరుకుంటూ ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

మరోవైపు రాజ్యాంగ నిబంధనలను గవర్నర్ తుంగలో తొక్కారని, తనను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించలేదని ఆరోపిస్తూ, శశికళ వర్గం నిరసనలకు దిగవచ్చని పోలీసులకు సమాచారం అందడంతో, రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చెన్నైకి వస్తున్న వారు ఎవరి అభిమానులో తెలియకుండా ఉంది. నిరసనలు జరిగితే, విధ్వంసం కూడా భారీగా ఉండవచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మెరీనా బీచ్ వంటి సమస్యాత్మక కీలక ప్రాంతాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎటువంటి నిరసనలకూ అనుమతులు లేవని స్పష్టం చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వం ఇంటి ముందూ భద్రతను పెంచారు. ఇంటికి వంద మీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు నిర్వహించారు. పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచారు. పన్నీర్ ఇంటి ప్రాంతం అభిమానుల నినాదాలతో హోరెత్తుతోంది. జరుగుతున్న పరిణామాలతో తమిళనాడులో క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది.

More Telugu News