: రాజసానికి, అధికార దర్పానికి మారుపేరైన 'అంబాసడర్' కారు బ్రాండ్ ను కొనుక్కున్న విదేశీ సంస్థ

మన దేశంలో ఓ వెలుగు వెలిగిన కారు అంబాసడర్. రాజసానికి మారుపేరుగా ప్రఖ్యాతి గాంచింది. భారత రాష్ట్రపతి వంటి అత్యంత ప్రముఖులు సైతం వాడిన కారు అంబాసడర్. అధికార దర్పానికి మారుపేరు అంబాసడర్. భారత రోడ్లపై అంబాసడర్ కారు కొనసాగించినంత ఆధిపత్యం మరే కారు కొనసాగించలేదంటే అతిశయోక్తి కాదు. దేశీయ సంస్థ హిందుస్థాన్ మోటార్స్ ఈ కార్లను తయారు చేసింది. 1980లలో మారుతి కారు రానంత వరకు అంబాసడర్ కు తిరుగే లేదు. మారుతి రాకతో అంబాసడర్ కారు విక్రయాలు తగ్గడం మొదలైంది. 1980 మధ్య కాలంలో ఏడాదికి 24 వేల అంబాసడర్ కార్లు అమ్ముడుపోగా... 2013-14 నాటికి విక్రయాలు 2,500కి పడిపోయాయి. మూడేళ్ల క్రితం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో, అంబాసడర్ కారు బ్రాండ్ ను హిందుస్థాన్ మోటార్స్... ఫ్రెంచ్ కార్ల తయారీదారు ఫ్యుగాట్ కు అమ్మేసింది. సీకే బిర్లా యాజమాన్యం గ్రూపులోని హిందుస్థాన్ మోటార్స్... ఫ్యుగాట్ తో రూ. 80 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఈ బ్రాండ్ అమ్మకంతో వచ్చిన డబ్బుతో... ఉద్యోగులు, రుణదాతల బకాయిలను క్లియర్ చేస్తామని సీకే బిర్లా గ్రూప్ ప్రతినిధి తెలిపారు. అయితే, అంబాసడర్ కార్లను ఫ్యుగాట్ సంస్థ మళ్లీ ఇండియాలో తయారు చేస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

More Telugu News