: తమిళనాడులో పీక్ స్టేజ్‌కి చేరిన టెన్షన్.. గవర్నర్ నిర్ణయం తీసేసుకున్నట్టు వార్తలు!

 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా గత నాలుగు రోజులుగా తమిళనాడులో సాగుతున్న డ్రామాకు గవర్నర్ శుభం కార్డు వేసినట్టు శుక్రవారం రాత్రి వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియక తమిళుల టెన్షన్‌ మరింత ఎక్కువైంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకుని గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసిన శశికళకు ఆయన షాకిచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అభ్యర్థనను గవర్నర్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి కేంద్రానికి పంపిన నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో శశికళ వర్గం షాక్‌కు గురికాగా పన్నీర్ వర్గం ఎగిరి గంతేస్తోంది.

గురువారం పన్నీర్ సెల్వం, శశికళ ఒకరి తర్వాత ఒకరు గవర్నర్‌ను కలిసి తమ వాదన వినిపించారు. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత గవర్నర్  ప్రకటన చేస్తారని ఊహించినా రాజ్‌భవన్ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. శుక్రవారం విద్యాసాగర్ ‌రావు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సమావేశమయ్యారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తోనూ మాట్లాడారు. వీరందరితో మాట్లాడిన తర్వాత గవర్నర్ శుక్రవారం రాత్రే కేంద్ర హోం శాఖకు నివేదిక పంపినట్టు తెలుస్తోంది. శశికళ ఆస్తులపై వచ్చేవారం కోర్టు తీర్పు రానుండడం, చట్టసభలో ఆమెకు సభ్యత్వం లేకపోవడంతో అవకాశం ఇవ్వకూడదని గవర్నర్ భావించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

More Telugu News