: అమెరికా టవర్లను కూల్చడానికి కారణమిదే: కీలక సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్ లేఖ

2001, సెప్టెంబర్ 11... యావత్ ప్రపంచం ఉలిక్కి పడిన రోజు ఇది. అమెరికన్లకయితే ఆరోజు ఒక పీడకల. అత్యంత బలమైన దేశంలో ఉన్నాం, మనకు ఏమీ కాదు అనే అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసిన రోజు. ట్విన్ టవర్లను విమానాల సహాయంతో ఆల్ ఖైదా కూల్చివేసింది ఆ రోజే. ఆనాటి దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ ఉన్నప్పటికీ, కీలక సూత్రధారి మాత్రం ఖలీద్ షేక్ మహ్మద్ అని చెబుతారు. తాజాగా, అమెరికా అధ్యక్షుడిగా ఒబామా దిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ఖలీద్ ఓ లేఖను పంపాడు. ఆ నాడు తాము చేసిన దాడికి కారణాలేంటో ఆ లేఖలో పేర్కొన్నాడు ఖలీద్.

అమెరికా చేపట్టిన విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగానే తాము ఆనాడు దాడులు జరిపామని ఖలీత్ స్పష్టం చేశాడు. చైనా, శాంతా ఆనా, మెక్సికో దేశాల నియంతలకు అమెరికా ఇస్తున్న మద్దతు తమకు నచ్చలేదని లేఖలో తెలిపాడు ఖలీద్. మీకు నచ్చని దేశాల్లో సైన్యాన్ని పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని... కానీ, ముస్లిం దేశాల్లో సైతం సైన్యాన్ని మోహరించారని మండిపడ్డాడు. కొరియా, వియత్నాం, టోక్యో, డ్రెస్డెన్, లాటిన్ దేశాలు, హిరోషిమా, నాగసాకిలపై అమెరికా చేసిన నేరాలు కోకొల్లలని విమర్శించాడు. పాలస్తీనాలో గత 60 ఏళ్లుగా మారణకాండను సృష్టిస్తున్నారని... మీ వల్ల 4 మిలియన్ల మంది అక్కడ నుంచి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇజ్రాయెల్ సేనలు చేసిన నేరాలు బయటకు రాకుండా ఐక్యరాజ్యసమితి సహకరించిందని ఆరోపించారు. దశాబ్దాల మీ దురహంకారాన్ని భరించలేకే అమెరికాపై దాడి చేశామని ఖలీద్ తెలిపాడు.

More Telugu News