: తెలుగు సీఎంల గల్ఫ్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రవాసాంధ్రులు

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల పర్యటన కోసం గల్ఫ్‌లోని ప్రవాసాంధ్రులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి పర్యటనల ద్వారా అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశగా ఉన్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జెరూసెలం సందర్శనకు వెళ్లి వస్తూవస్తూ దుబాయ్‌లో దిగారు. ఆయన సందర్శనతో తమ కష్టాలు తీరుతాయని ప్రవాసాంధ్రులు భావించారు. అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన రస్ అల్ ఖైమాలో పర్యటించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రవాసాంధ్రుల సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి.

 ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గల్ఫ్ దేశాల్లో పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆయన పర్యటన మళ్లీ ఎప్పుడుంటుందో తెలియదు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గల్ఫ్ పర్యటనకు రావాలని అక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్న తెలంగాణ వారు కోరుతున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. గల్ఫ్ దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం ద్వారా రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని, తమ సమస్యలకు పరిష్కార మార్గం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ముందంజలో వుందని, పార్టీలకు అతీతంగా కేరళలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, ఆ ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రవాసాంధ్రులు చెబుతున్నారు.

More Telugu News