: ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లపై తీవ్ర ఆరోపణలు చేసిన మోదీ...వాకౌట్ చేసిన కాంగ్రెస్

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో మాజీ ప్రధానులు దివంగత ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ లపై విమర్శలు చేశారు. ఇందిరా గాంధీని నేరుగా విమర్శించని మోదీ...1971లో పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ...ఇందిరా గాంధీ జీవితం నల్లధనంతో ముడిపడి ఉందని అన్నారు. నల్లధనం కారణంగానే కేంద్రంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ ఆర్థిక విధానాలు, రెయిన్ కోటు వేసుకుని, షవర్ కింద స్నానం చేసినట్టు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తొలుత మన్మోహన్ విధానాలను ఆయన విమర్శిస్తుండగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అనంతరం ఆయన ఇందిరా గాంధీపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తామెవరూ డీమోనిటైజేషన్ ను వ్యతిరేకించలేదని, దానికి అనుసరించిన విధానాన్ని తప్పుపట్టామని ఆయన తెలిపారు. గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని ఆయన నిలదీశారు. గతంలో పలువురు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం కాకుండా...మీరేం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను 'తొందరెందుకు, మీరు మాట్లాడడానికి జీవిత కాలం ఉంది..తరువాత మాట్లాడండి' అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. డీమోనిటైజేషన్ సత్ఫలితాలనిస్తోందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు ఆగిపోయాయని ఆయన చెప్పారు. 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. బీమా యాప్ రూపొందించడంలో రూపాయి ఖర్చు లేదని ఆయన తెలిపారు. 

More Telugu News