: మీకు అన్నాడీఎంకేలో ఆరేళ్ల సభ్యత్వం ఎక్కడుంది?: శశికళకు ఈసీ నోటీసులు జారీ

తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆశపడుతున్న వీకే శశికళా నటరాజన్ కు ఎన్నికల కమిషన్ రూపంలో మరో అడ్డంకి ఎదురైంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎంపిక ఎలా అర్హమైనదో తెలియజేయాలని ఆదేశించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలంటే, కనీసం ఆరేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యత్వం కలిగి ఉండి తీరాలని గుర్తు చేస్తూ, అర్హతలు లేని వారికి మధ్యంతరంగా బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది. శశికళ ఎన్నిక పత్రం తమిళంలో ఉండటంతో, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నామని, దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసి పంపుతూ, తమ సందేహాలకు వెంటనే సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కాగా, ఆమె తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని పన్నీర్ సెల్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏ రాజకీయ పార్టీలో కూడా తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి ఉండదని, ఈసీ నోటీసులు శశికళకు కొత్త తలనొప్పేనని రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు. శశికళకు వరుసగా ఆరేళ్ల పాటు అన్నాడీఎంకేలో సభ్యత్వం లేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News