: తమిళనాడులో ఆట మొదలుపెట్టిన కేంద్రం.. పన్నీర్ ధిక్కారం వెనక మోదీ!

తమిళనాడులో కేంద్రం ఆట మొదలుపెట్టిందా? పన్నీర్ ధిక్కారం వెనక మోదీ సర్కారు ఉందా? మోదీ అండతోనే పన్నీర్ సెల్వం.. శశికళపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారా?... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శశికళపై పూర్తి వ్యతరేకతతో ఉన్న కేంద్రం ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పీఠంపై కూర్చోకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు ఈ మేరకు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ద్వారా పావులు కదుపుతోంది.

అలాగే, శశికళపై ఉన్న కేసుల్లో తీర్పు వచ్చే వరకు తమిళనాడులో అడుగుపెట్టవద్దంటూ గవర్నర్ విద్యాసాగర్‌రావును కేంద్రం ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు పన్నీర్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా అన్నాడీఎంకేను చీల్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం జయ సమాధి వద్దకు వెళ్లారని, అనంతరం శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారని విశ్లేషిస్తున్నారు. పార్టీ ముక్కలైతే తగినంత బలం లేక శశికళ సీఎం పీఠం ఎక్కడం కష్టమవుతుందని కేంద్రం భావిస్తోంది.

కాగా అవసరమైతే పన్నీర్‌కు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దురై మురుగన్ ద్వారా పన్నీర్‌కు సమాచారం పంపినట్టు సమాచారం. ప్రస్తుతం సెల్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు మరికొందరు తోడైతే ఆయన రాజీనామాను అంగీకరించడం లేదని గవర్నర్‌తో చెప్పించాలని కేంద్రం యోచిస్తోంది. అప్పటికీ శశికళ వెనక్కి తగ్గకపోతే రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఆమెకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. అవసరమైతే పన్నీర్‌ను, ఆయనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవాలని కేంద్రం  దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News