: శశికళ నన్ను నానా రకాలుగా అవమానించారు.. ఆవేదన వ్యక్తం చేసిన పన్నీర్ సెల్వం

‘అమ్మ’ సూచన మేరకు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తనను శశికళ, ఆమె వర్గం వారు నానా రకాలుగా అవమానించారని పన్నీర్ సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి జయలలిత సమాధి వద్ద దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు గడిపిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శశికళపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం అయిన తాను పార్టీ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ప్రయత్నించానని, అయితే తన ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుతగిలారని పేర్కొన్నారు. ప్రతిసారి తన స్థాయిని తగ్గించాలని చూశారన్నారు.

ఆదివారం తనను పోయెస్‌గార్డెన్‌కు పిలిచారని, అప్పటికే అక్కడ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శశికళ కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు. అక్కడికెళ్లిన తనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని శశికళ డిమాండ్ చేశారన్నారు. శశికళ వ్యాఖ్యలతో హతాశుడినైన తాను తనకు తెలియకుండా సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించానని నిలదీశానన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా ఒకరే ఉండాలని, కాబట్టి ఆమెను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని పన్నీర్ చెప్పుకొచ్చారు.

వారితో రెండు గంటలపాటు వాదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తనతో రాజీనామా చేయించడం సబబేనా అని ప్రశ్నించానని తెలిపారు. అయితే పార్టీ క్రమశిక్షణ కోసం అవమానాన్ని భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జయ సమాధి వద్దకు వెళ్తానన్నా అనుమతించలేదన్నారు. తమిళనాడుకు తాను కాకపోయినా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడే వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకోసం ఒంటరిగానైనా చివరి వరకు పోరాడేందుకు సిద్ధమని పన్నీర్ సెల్వం ప్రకటించారు.

More Telugu News