: మసూద్ విషయంలో చైనాకు షాకివ్వనున్న ట్రంప్?

పాక్ ఉగ్రవాది మసూద్ అజహర్ విషయంలో భారత్ కు ఎప్పటికప్పుడు అడ్డుతగులుతున్న చైనాకు అమెరికా షాకివ్వనుంది. ఐక్యరాజ్యసమితిలో మసూద్‌ పై నిషేధం విధించాలన్న భారత్ డిమాండ్ కు పదేపదే అడ్డు తగులుతున్న చైనాను అడ్డుకునేందుకు దీటైన జవాబిచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది. పాక్‌ తో కొత్త బంధం కోసం అర్రులు చాస్తూ అంటకాగుతున్న చైనా పలుమార్లు మసూద్ అజహర్ పై నిషేధం విషయంలో భారత్ కు ఎదురుతిరుగుతూ అడ్డుపుల్ల వేస్తూనే ఉంది. అంతేకాకుండా పాక్, చైనాలు ఉగ్రవాదాన్ని సహించమంటూనే ఉగ్రవాదులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పాక్ తో యూఎ‌స్ కు ఉన్న వ్యూహాత్మక బంధం కారణంగా అమెరికా ఇన్నాళ్లు భారత్ ను గట్టిగా సమర్ధించలేకపోయింది.

అంతేకాకుండా, మసూద్ విషయంలో యూఎస్, భారత్ కు పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందించలేకపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వాదనకు గట్టిమద్దతిచ్చారు. అతనిపై నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితికి ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాక్ లో ఉగ్రవాదంతో పాటు మసూద్ ను వెనుకేసుకొచ్చిన చైనా ఈసారి ఎలా అడ్డుకుంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చైనాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ట్రంప్, భారత్ కు బాసటగా నిలిస్తే... చైనాకు తలనొప్పి పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంతో చైనాకు, ఉగ్రవాదులను పదేపదే భారత్‌ పై ఉసికొల్పుతున్న పాక్‌ కు ముకుతాడు పడనుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

More Telugu News