: రాజీవ్ గాంధీ ఫోన్లు తెచ్చారని కాంగ్రెస్ నేతలు రోజూ చెప్పుకుంటారు.. మరోవైపు ఫోన్లు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు : మోదీ చురకలు

దేశంలో తనలాంటి ప్రజలే చాలా మంది ఉన్నార‌ని, తామంతా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన‌లేద‌ని, కానీ దేశం కోస‌మే జీవిస్తున్నామ‌ని, దేశ సేవ‌లో పాల్గొంటున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు లోక్‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ... త‌మ పోరాటం అంతా పేద ప్ర‌జ‌ల అభివృద్ధి కోస‌మేన‌ని అన్నారు. తాము ప్ర‌తియేటా 22 ల‌క్ష‌ల 27వేల ఇళ్లు నిర్మించాల‌ని నిర్ణయించుకున్నామ‌ని తెలిపారు. ధ‌ర్మ పాల‌న‌లో కాంగ్రెస్ త‌ప్ప‌ట‌డుగులు వేసింద‌ని ఆయ‌న అన్నారు. రాజీవ్ గాంధీ మన దేశానికి ఫోన్లు తెచ్చారని కాంగ్రెస్ నేత‌లు రోజూ చెప్పుకుంటారని, మ‌రి తాము ఇప్పుడు మొబైల్ ఫోన్‌ల‌ను డిజిట‌ల్ లావాదేవీల‌కు ఉప‌యోగిద్దామంటే ఫోన్‌లు ఎవ‌రి ద‌గ్గ‌రున్నాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారని మోదీ వ్యంగ్యంగా అన్నారు.
 
విదేశాల్లో ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని తెచ్చేందుకు తాము ఇప్ప‌టికే మారిష‌స్‌, సింగ‌పూర్‌, స్విట్జ‌ర్లాండ్ దేశాల‌ను సంప్ర‌దించామ‌ని, ఆయా దేశాలు సానుకూలంగా స్పందించాయ‌ని మోదీ చెప్పారు. న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీసే విష‌యంలో ఎవ‌రిమాటా వినబోమ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశాన్ని దొంగ‌దారుల్లో కొల్ల‌గొట్టారని, అవినీతిప‌రుల‌కున్న‌ ఒక్కోదారినీ మూసేస్తున్నామ‌ని అన్నారు. తాము తీసుకొచ్చిన భీమ్ యాప్ ద్వారా వ్యాపారులు, వినియోగ‌దారుల‌కు ఎన్నో లాభాలు చేకూరుతాయని మోదీ అన్నారు. మ‌న‌ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లంగా ఉంది కాబ‌ట్టే పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మోదీ అన్నారు.  

More Telugu News