: ఇంత జ్ఞానం మీకుందని నేనూహించలేదు సుమా!: కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేసిన మోదీ

దేశంలో అత్యంత పురాతన రాజకీయ పార్టీగా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ఇంత మాత్రం తెలివితేటలు ఉన్నాయని తాను ఊహించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ జరగగా, ప్రధాని మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన నల్లధనం నగదు రూపంలో లేదని, బంగారం, స్థిరాస్తులు, కంపెనీల్లో షేర్ల రూపంలో ఉందని కాంగ్రెస్ చెప్పిందని, ఆ తెలివితేటలు వారికి ఎప్పుడు వచ్చాయని అడిగారు.

దేశంలో కోల్ స్కామ్, 2జీ స్కామ్ సూత్ర, పాత్రధారులైన పార్టీ, నోట్ల రద్దు తరువాత ఎంత మొత్తం వ్యవస్థలోకి వచ్చిందని అడగటం మంచిదేనని అన్నారు. కాంగ్రెస్ లూటీ చేసిన మొత్తాన్ని తమ ప్రభుత్వం తిరిగి రాబట్టేందుకు యత్నిస్తోందని తెలిపారు. తామే నిజమైన మహాత్మా గాంధీ అనుచరులమని, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం గాంధీలు ఇచ్చిన వరంగా కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. చేసిన కుంభకోణాలే దేశసేవగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని, కుంభకోణాల్లో భాగంగా కాంగ్రెస్ స్వాహా చేసిన సొమ్మును ఖర్చు పెడితే, దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. మోదీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.

More Telugu News