: వెళ్లిపోతాం పంపించండి మహాప్రభో... ఎయిర్ ఇండియాకు పైలట్ల మొర

ఎయిర్ ఇండియా ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఇంధన ఆదా డ్రీమ్ లైనర్ విమానాలను నడుపుతున్న 24 మంది పైలట్లు, తాము రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. సంస్థను వీడి వెళ్లేందుకు అనుమతించాలంటూ, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. తమ కెరీర్ లో ఉన్నతి లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, 2005లో ఎయిర్ ఇండియా 27 డ్రీమ్ లైనర్ విమానాలకు ఆర్డర్ ఇవ్వగా, ఇప్పటివరకూ 23 విమానాలు డెలివరీ అయ్యాయి. ఈ విమానాలు నడిపేందుకు సంస్థ 300 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చింది. వీరంతా ఇండియన్ ఎయిర్ లైన్స్ లో 2007-08లో చేరిన వారు. ఎయిర్ బస్ ఏ-320ఎస్ విమానాలను నడిపిన వారు. ఇప్పుడు డ్రీమ్ లైనర్ విమానాల్లో వీరంతా కో-పైలట్లుగా ఉండగా, తమతో పాటు సంస్థలో చేరిన వారంతా ఏ-320 కమాండర్లుగా పదోన్నతులు తెచ్చుకున్నారని, తాము మాత్రం 787లో కో-పైలట్లుగా మిగిలిపోయామన్నది వీరి వాదన. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించాల్సి వుంది.

More Telugu News