: నేతాజీ అంగరక్షకుడు కల్నల్ షేక్ నిజాముద్దీన్ కన్నుమూత

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అంగరక్షుడిగా, డ్రైవర్‌గా పనిచేసిన కల్నల్ షేక్ నిజాముద్దీన్ అలియాస్ సైఫుద్దీన్(116) సోమవారం ఉదయం కన్నుమూశారు. 1900 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లా ధక్వా గ్రామంలో జన్మించిన నిజాముద్దీన్ తండ్రికి తెలియకుండా 1943లో బ్రిటిష్ నియంత్రణలో ఉన్న భారత సైన్యంలో చేరారు. అనంతరం తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఓ బ్రిటిష్ అధికారిని కాల్చి చంపారు. దాన్నుంచి తప్పించుకునేందుకు సింగపూర్ పారిపోయారు. 1943లో సింగపూర్ వచ్చిన నేతాజీ ఇచ్చిన ‘చలో ఢిల్లీ’ నినాదానికి ఆకర్షితుడైన నిజాముద్దీన్ ఐఎన్ఏలో చేరారు. అనంతరం తన పేరును షేక్ సైఫుద్దీన్‌గా మార్చుకున్నారు. ఆయన కార్యదక్షత, నిబద్ధతకు ముగ్ధుడైన నేతాజీ నిజాముద్దీన్‌ను తన డ్రైవర్‌గా నియమించుకున్నారు. అప్పటి  నుంచి నేతాజీకి ఆయన అంగరక్షకుడిగా, డ్రైవర్‌గా సేవలందించారు. భూమిపై జీవించి ఉన్న అత్యధిక వయస్కుడిగా రికార్డు సృష్టించిన నిజాముద్దీన్ గతేడాది బ్యాంకు ఖాతా తెరిచి దేశంలో బ్యాంకు ఖాతా తెరిచిన అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కారు.  

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారన్న వాదనను ఖండించిన నిజాముద్దీన్ భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బతికే ఉన్నారని పలుమార్లు స్పష్టం చేశారు. విమాన ప్రమాదం జరిగిన నాలుగు నెలల తర్వాత నేతాజీని తానే స్వయంగా బర్మా-థాయ్‌లాండ్ సరిహద్దులోని సీతాంగపూర్ వద్ద వదిలిపెట్టానని ఓ సందర్భంలో పేర్కొన్నారు. అంతేకాదు హత్యాయత్నం నుంచి ఓసారి ఆయనను కాపాడానని తెలిపారు. ఆ ఘటన తర్వాత నేతాజీ తనను ‘కల్నల్’ అని పిలిచారని పలు సందర్భాల్లో తెలిపారు. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సైఫుద్దీన్‌కు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య షేక్‌ హబీబున్నీసా, ఏడుగురు పిల్లలు ఉన్నారు.

More Telugu News