: సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన మాటల రచయిత పరుచూరి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ ప్రశంసలు కురిపించారు. నాగబాల సురేశ్ కుమార్ రచించిన ‘తెలంగాణ కోటలు’ అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఈరోజు ఆయన వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చాంబర్ లో ఆయనతో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం గోపాలకృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్ము మాత్రమే కాదు మనసు కూడా ఉన్న నాయకుడని ప్రశంసించారు. ఏ గడ్డపై అయితే తాను పుట్టారో ఆ గడ్డకు న్యాయం చేసేందుకు కేసీఆర్ పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు.

ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నిరుపేదల కోసం ఒక గదిని నిర్మిస్తే.. నేడు డబుల్ బెడ్ రూమ్ గదులను కేసీఆర్ అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కేవీ రమణా చారి మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ కు అంకితమివ్వడం చాలా గొప్ప విషయమన్నారు. చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కుతుబ్ షాహీ టూంబ్స్ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి కారణం నాడు ఎన్టీఆర్ చేసిన కృషేనని అన్నారు.

More Telugu News