: పాముని పట్టుకొని ఫొటో తీసుకునే ప్ర‌య‌త్నం.. యువ‌కుడి మృతి

ఆ యువకుడు సుమారు వంద పాములను కాపాడాడు. త‌న‌ను పాములు ఇక ఏం చేయ‌లేవు అనుకున్నాడు. కానీ, చివ‌ర‌కు తాను కాపాడిన ఓ పాము కాటుతోనే చ‌నిపోయాడు. ముంబయికి చెందిన సోమనాథ్‌ మాత్రే పాములను కాపాడే వ్యక్తిగా ఎంతో కాలంగా ప‌నిచేస్తున్నాడు. ఈ నెల‌ తన స్నేహితుడి నుంచి వ‌చ్చిన స‌మాచారంతో సీబీడీ బెలాపూర్‌ ప్రాంతంలో ఓ కారులో ఉన్న పామును రక్షించేందుకు వెళ్లాడు. అయితే, పామును చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న సోమనాథ్‌ దాన్ని మరో చోటుకు తీసుకెళ్లి, దాని త‌లపై ముద్దుపెడుతూ ఫొటో దిగాల‌ని చూశాడు.

ఒక్క‌సారిగా ఆ పాము సోమ‌నాథ్‌ ఛాతీ భాగంపై కాటు వేయ‌డంతో అత‌డిని హుటాహుటిన ఆసుప‌త్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటున్న సోమనాథ్‌ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. గత 12 ఏళ్లలో పాములను రక్షించే వ్యక్తులు 30 మంది ఇదే విధంగా మరణించార‌ని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

More Telugu News