: అమెరికాపై ఆశలు సన్నగిల్లాయ్.. యూరప్, కెనడాల వైపు చూస్తున్న భారతీయ టెక్కీలు!

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సన్నీ నాయర్ అమెరికాకు వెళ్లి... అక్కడున్న ఇన్ఫోసిస్ లాంటి ఓ పెద్ద భారతీయ టెక్నాలజీ సంస్థలో పని చేయాలని కలలుగన్నాడు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం అతని కలలను కల్లలు చేసింది. అతని జీవిత లక్ష్యాన్ని ఆదిలోనే చిదిమేసింది. ఇది ఒక్క సన్నీ నాయర్ పరిస్థితే కాదు. ఎంతో మంది భారతీయ విద్యార్థులది. మన దేశంలోని ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఎంతో మంది సాఫ్ట్ వేర్ నిపుణులది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల పాలిట శరాఘాతంగా మారింది. ఐటీ నిపుణుల అమెరికా డ్రీమ్స్ కరిగిపోయేలా చేసింది. ప్రతి ఏడాది భారతీయ ఐటీ సంస్థల నుంచి వేలాది మంది నిపుణులు హెచ్1బీ వీసా ద్వారా అమెరికా వెళుతున్నారు. అయితే, అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్లకే అంటూ హెచ్1బీ వీసాలపై ట్రంప్ పలు ఆంక్షలు విధించారు. విదేశీ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉండాలని షరతు విధించడంతో, మన ఉద్యోగులను అమెరికాలో పోషించడం అమెరికన్ కంపెనీలకు కానీ, లేదా అక్కడున్న భారతీయ కంపెనీలకు కానీ పెను భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో, ఎక్కువ మంది భారతీయులను అక్కడకు తీసుకెళ్లే ఆలోచనను మన కంపెనీలు కూడా విరమించుకుంటున్నాయి. ఈ క్రమంలో, మన ఐటీ సంస్థలు, నిపుణుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. అమెరికాపై ఆశలను క్రమంగా తగ్గించుకుంటూ... యూరిపియన్ దేశాలు, కెనడాపై దృష్టి సారిస్తున్నారు.

మరోవైపు ట్రంప్ నిర్ణయంపై నాస్కామ్ ప్రెసిడెండ్ మాట్లాడుతూ, ట్రంప్ నిర్ణయం ఒక అస్థిరతను మిగుల్చుతుందని అభిప్రాయపడ్డారు. నిపుణుల కొరతతో అక్కడి వ్యాపారం దెబ్బతింటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం రెండు పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉందని... మొదటిది ఈ ఉద్యోగాలు భర్తీ కాకపోవచ్చని, ఖాళీగానే మిగిలిపోవచ్చని తెలిపారు. రెండోది, ఈ ఉద్యోగాలన్నీ విదేశాలకు తరలిపోవచ్చని చెప్పారు. ప్రముఖ టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ గార్ట్ నర్ విశ్లేషకుడు మిశ్రా మాట్లాడుతూ, ఇండియన్ ఐటీ కంపెనీలు అమెరికాను వదిలేసి, ఏషియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించడానికి యత్నించవచ్చని అంచనా వేశారు. టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ మాట్లాడుతూ, గ్లోబలైజేషన్ యుగంలో కూడా రక్షణ పేరుతో బంధనాలను విధించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం కాదని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం సమస్యలన్నింటిపై లోతుగా అధ్యయనం చేసి, తుది నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.  

మరోవైపు, ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీల మధ్య సంబంధాలకు కూడా అవరోధంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒకరి దేశంలో మరొకరు పర్యటించాలని ఈ ఇద్దరు నేతలు పరస్పరం ఆహ్వానించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News