: జయలలిత, శశికళపై అక్రమాస్తుల కేసు... సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వారమే!

ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారన్న కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలపై సుప్రీంకోర్టు వచ్చే వారంలో కీలక తీర్పివ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్, అమితవ రాయ్ లతో కూడిన డివిజన్ బెంచ్ తన ఆదేశాలు జారీ చేయనుంది. ఈ కేసులో దశాబ్దాల కాలం పాటు విచారణ సాగిన సంగతి తెలిసిందే. వాదోపవాదాలన్నీ పూర్తి కాగా, గత నవంబరులో తీర్పును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. వాదనలు పూర్తయినందున వెంటనే తీర్పును వెలువరించాలని కర్ణాటక ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దావే నేడు కోర్టుకు అపీలు చేయగా, మరో వారం రోజులు వేచి చూడాలని న్యాయమూర్తి తెలిపారు.

ఈ వారంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ తీర్పు వెల్లడి కానుండటం గమనార్హం. కాగా, శశికళపై పలు కేసులు పెండింగ్ దశలో ఉన్నాయి. ఆమెతో పాటు ఆమె భర్త నటరాజన్, బంధువులు దినకరన్, సుధాకరన్, సోదరుడు దివాకరన్, సోదరుడి భార్య ఇళవరసి తదితరులపైనా కేసులు నడుస్తున్నాయి. 1996లో రూ. 66.65 కోట్ల విలువైన అక్రమాస్తులు కలిగివున్నట్టు జయలలితపై కేసు నమోదుకాగా, అందులో శశికళ పేరూ ఉంది. జయలలిత దోషిగా తేలిన కేసుల్లో ప్లెజంట్ స్టే హోటల్స్ కేసు మినహా మిగతా అన్నింటిలో శశికళ కూడా దోషేనని కోర్టులు స్పష్టం చేశాయి.

More Telugu News