: ఆమె గుండెలో ఐదు గదులున్నాయి!

సాధారణంగా ఎవరి గుండెలో అయినా నాలుగు గదులే ఉంటాయి. ఇదే అందరూ చిన్ననాటి నుంచి చదువుకుని ఉంటారు. కానీ, కోల్‌ కతాకు చెందిన రీమా పాఠక్ (17) అనే యువతి గుండె మాత్రం ఐదు గదుల గుండె. ఈ వింత వైద్యులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం వరకు ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేది. అయితే ఆమె ఊపిరితిత్తుల్లో బాగా నిమ్ము చేరడంతో, వారణాసికి చెందిన ఆమె కుటుంబ సభ్యులు బెనారస్ హిందూ యూనివర్సిటీలోని ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఊపిరితిత్తుల్లో నిమ్ము తీసి, గుండె లోపాన్ని కనుగొన్నారు. తక్షణం ఆపరేషన్ చేయకపోతే ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెకు ఆపరేషన్ చేయించాలని నిర్ణయించారు. అయితే ఆమెకు ఎక్కడ ఆపరేషన్ నిర్వహిస్తారో తెలియలేదు.

దీంతో వారు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఇలా రెండేళ్ల పాటు ఆమెకు ఆపరేషన్ చేసే వైద్యులను వెతికేందుకే సరిపోయింది. అయితే ఆమెకు ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి చెందిన వాస్క్యులర్ సర్జరీ, కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు డాక్టర్ శంతను దత్తా నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించేందుకు అంగీకరించారు. ఆమెకు కుడివైపు ఉన్న ఆట్రియం, ఎడమవైపున్న ఆట్రియంల మధ్య ఒక సన్నటి పొర ఏర్పడింది. దాంతో అక్కడ రెండు గదులకు బదులు మూడు గదులు ఏర్పడ్డాయి. ఇది పుట్టుకతోనే ఏర్పడుతుందని, అయితే ఈ సమస్య ప్రతి కోటి మందిలో కేవలం 0.1% మందికి మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇలాంటి సమస్యను గుర్తించిన వెంటనే ఆపరేషన్ చేయాలని తెలిపారు. కాగా, ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడామె కోలుకుంటోందని. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

More Telugu News