: ఏటీఎంలో మహిళను చంపిన వ్యక్తి నేర చరిత్రను వివరించిన పోలీసులు!

కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలో మహిళను కత్తితో నరికి దోచుకెళ్లిన ఘటనలో నిందితుడు మధుకర్ రెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ, మధుకర్ రెడ్డికి ఘన నేరచరిత్ర ఉందని అన్నారు. ఐదేళ్ల క్రితం హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాదులో మకాం పెట్టాడని అన్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవతో అఫ్జల్ గంజ్ ప్రాంతంలో కొడవలిలాంటి ఆయుధం తోపాటు టాయ్ పిస్టల్ కొనుగోలు చేశానని నేరస్తుడు చెప్పినట్టు ఆయన తెలిపారు. అయితే ఆ తుపాకీ నిజంగానే టాయా? అన్నది నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. కొనుగోలు చేసిన ఆయుధాలతో జడ్చర్ల వెళ్లాడని అన్నారు.

అక్కడ నారాయణ అనే వ్యక్తితో బార్ లో గొడవపడ్డాడని, అతను బయటికి రాగానే అతనిపై దారుణంగా దాడి చేసి, పరారయ్యాడని, అయితే నారాయణ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బతికాడని తెలిపారు. అక్కడి నుంచి ట్రైన్ లో ధర్మవరం చేరుకున్నాడని చెప్పారు. ధర్మవరం రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉన్న ఇంటికెళ్లి ఓ వృద్ధురాలిని నగలిచ్చేయాలని భయపెట్టాడని, అయితే సదరు మహిళ నిరాకరించడంతో ఆమెను చంపి, ఆమె చెవికమ్మలు, నగలు, ఏటీఎం కార్డు తీసుకెళ్లాడని చెప్పారు. అక్కడి నుంచి కదిరి వెళ్లాడని, అక్కడ ఆమె ఏటీఎం నుంచి 3,500 రూపాయలు విత్ డ్రా చేశాడని తెలిపారు. ఆరు రోజులు అక్కడే ఉండి అక్కడ గిట్టుబాటు కాకపోవడంతో బెంగళూరు వెళ్లాడని తెలిపారు. ఆకలిగా ఉండడంతో వేకువజామున పలు ఏటీఎంలు పరిశీలించి, షట్టర్ ఉన్న ఏటీఎంను ఎంచుకున్నాడని చెప్పారు.

అందులోకి మహిళ ప్రవేశించిన వెంటనే తాను కూడా వెళ్లి, ఆమెపై దాడి చేసి కత్తితో నరికాడని తెలిపారు. ఈ హత్య గతంలో అతను చేసిన హత్యకంటే ఎక్కువ కలకలం రేపడంతో, అక్కడి నుంచి కేరళలోని ఎర్నాకుళం పారిపోయాడని తెలిపారు. గుండు చేయించుకుని ఏడాదిపాటు అక్కడే చిన్నచిన్న దొంగతనాలు, చైన్ స్నాచింగులు చేస్తూ ఉన్నాడని తెలిపారు. ఏడాది తరువాత మళ్లీ హైదరాబాదు వచ్చి మళ్లీ పాత జీవితం మొదలుపెట్టాడని చెప్పారు. అక్కడి నుంచి సీలేరు వెళ్లి అక్కడ దొంగతనాలు చేసేవాడని అన్నారు. ఈ క్రమంలో మధుకర్ రెడ్డి గురించి వెతుకుతున్న పోలీసులకు అతను సొంతూరు మదనపల్లె వస్తున్నట్టు సమాచారం అందిందని, దీంతో మాటువేసి అతనిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ మధ్యలో ఏం చేశాడు? ఎక్కడున్నాడు? ఇలా చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఎంక్వయిరీ జరగాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

More Telugu News