: ‘కోహ్లీ’కి మరో అరుదైన గౌరవం... సచిన్‌ తర్వాత అతనికే సొంతం!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన గౌరవాన్ని ద‌క్కించుకున్నాడు. ఇంగ్లండ్ లోని ప్ర‌సిద్ధ‌ విజ్డన్‌ మ్యాగజైన్‌ తన కవర్‌పేజ్‌పై 2017 ఏడాదికిగానూ విరాట్ బొమ్మ‌ను ప్ర‌చురించింది. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లి 2595 పరుగులు చేసి, అద్భుత‌మైన ఆట‌తీరుని క‌న‌బ‌రిచిన విష‌యం తెలిసిందే. గత ఏడాది క్రికెట్ లో విరాట్ కోహ్లీ క‌న‌బ‌రిచిన ఆట‌తీరుకి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా తెలిపింది. ప్ర‌పంచంలోని ఎంద‌రో దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌కు కూడా ద‌క్క‌ని గౌర‌వం కోహ్లికి ద‌క్కింది. 2014లో టీమిండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కు కూడా ఈ గౌర‌వం ద‌క్కింది. అనంత‌రం మూడేళ్ల‌కే ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయుడుగా కోహ్లి నిలిచాడు.

 మ్యాగ‌జైన్ విడుద‌ల సంద‌ర్భంగా విజ్డన్‌ ఎడిటర్‌ లారెన్స్‌ బూత్‌ మాట్లాడుతూ కోహ్లీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కోహ్లీ ఒక‌ ఆధునిక క్రికెటర్ అని, అతడు నిలకడగా రాణిస్తున్న తీరుకు త‌మ‌ మ్యాగజైన్‌ కవర్‌పై ఆయ‌న ఫొటోను ప్రచురించి గౌరవించడానికి ఇదే సరైన సమయమ‌ని చెప్పారు. ఇటీవ‌ల ఇంగ్లాండ్‌పై జ‌రిగిన సిరీస్‌లోనూ కోహ్లీ ప్రదర్శన చూసిన త‌రువాత‌ అభిమానుల మనసులో కోహ్లీ సరికొత్త స్థానం సంపాదించుకున్నాడని వ్యాఖ్యానించారు. టెస్టు, వ‌న్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో అత్యంత ఉత్తేజితమైన బ్యాట్స్‌మన్‌ కోహ్లీయే అని తెలిపారు. అందుకే తాము స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌, ఏబీ డివిలియర్స్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లను కూడా కాద‌ని కోహ్లీ ఫొటోను కవర్ పేజీపై ముద్రించామ‌ని తెలిపారు.

More Telugu News