: సింగ‌పూర్ కంటే అమ‌రావ‌తే బెట‌ర్‌!.. తేల్చి చెప్పిన జాతీయ హ‌రిత ధ‌ర్మాస‌నం

వాయుకాలుష్యం విష‌యంలో సింగ‌పూర్ కంటే న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తే మెరుగ్గా ఉంద‌ని జాతీయ హ‌రిత ధ‌ర్మాస‌నం(ఎన్జీటీ) పేర్కొంది. అమ‌రావ‌తి నిర్మాణంపై దాఖ‌లైన పిటిషన్ల‌పై శుక్ర‌వారం  ఎన్జీటీలో విచార‌ణ కొన‌సాగింది. ఈ  సంద‌ర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శ‌ర్మ త‌ర‌పున న్యాయ‌వాది రిత్విక్ ద‌త్తా వాద‌న‌లు వినిపించారు. సింగ‌పూర్ లాంటి రాజ‌ధానిని నిర్మిస్తామంటూ అమ‌రావ‌తిని మ‌రో ఢిల్లీ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అక్క‌డ ఇప్ప‌టికే వాయుకాలుష్యం బాగా పెరిగిపోయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అనువైన రాజ‌ధాని నిర్మిస్తామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం ప్ర‌మాణాల విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డింద‌ని పేర్కొన్నారు. ఇలా అయితే ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని క‌లే అవుతుంద‌ని ధ‌ర్మాస‌నానికి స్ప‌ష్టం చేశారు.

ద‌త్తా వాద‌న‌లకు ధ‌ర్మాస‌నం స‌భ్యుడు జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ రాథోడ్ స్పందిస్తూ అమ‌రావ‌తిలో కాలుష్య‌స్థాయి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం అక్క‌డ 58 పాయింట్లు ఉంద‌ని, మ‌రో రెండు పాయింట్లు పెరిగితే కాలుష్యం ఉన్న‌ట్టేన‌ని తెలిపారు. ఎన్టీజీ చైర్మ‌న్ జ‌స్టిస్ స్వతంత్ర కుమార్ మ‌ధ్య‌లో క‌ల్పించుకుని సింగ‌పూర్‌లో వాయు కాలుష్యం స్థాయి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అక్క‌డ 87 పాయింట్లు ఉంద‌ని ద‌త్తా బ‌దులిచ్చారు. దీంతో స్పందించిన ధ‌ర్మాస‌నం.. 'అంటే సింగ‌పూర్ కంటే అమ‌రావ‌తి ఎంతో మెరుగ్గా, ప్ర‌మాణాల‌కు లోబ‌డి ఉన్న‌ట్టే క‌దా?' అని అభిప్రాయ‌ప‌డింది.

అమ‌రావ‌తిలో ప్ర‌స్తుతం ఎటు చూసినా ప‌చ్చ‌దనం క‌ళ‌క‌ళ‌లాడుతూ క‌నిపిస్తోంద‌ని, రాజ‌ధాని నిర్మాణం ప్రారంభ‌మైతే వాయుకాలుష్యం విప‌రీతంగా పెరిగిపోతుంద‌ని ద‌త్తా తెలిపారు. అంతేకాక అమ‌రావ‌తిలోనే ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లిని నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌న్నారు. దీనికి జ‌స్టిస్ రాథోడ్ స్పందిస్తూ అవ‌న్నీ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించారు. కేటిగిరి-1 ప్ర‌కారం రాజ‌ధాని నిర్మాణానికి రాష్ట్రస్థాయిలో అనుమ‌తులు స‌రిపోతాయ‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.  

More Telugu News