: ఇంజనీరింగ్ విద్యార్థుల 'బ్రోతల్ ట్రాప్'... కటకటాల్లోకి నెట్టిన పోలీసులు!

ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు సహా ఏడుగురు సభ్యులున్న బ్రోతల్ గ్యాంగును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు, ప్రగతి నగర్ కు చెందిన బి.రంగరాజుతో పాటు గీతమ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న వంశీ కిరణ్, నాగేంద్ర బాబు, సాయి కిరణ్, ప్రణీత్ రెడ్డి, సాయితేజ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. వీరి చేతుల్లో మోసపోయిన ఓ వ్యక్తి తమకు చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారించి ఈ 'బ్రోతల్ ట్రాప్' గుట్టు రట్టు చేసినట్టు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తొలుత వీరు ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా తమ వద్ద అందమైన అమ్మాయిలు ఉన్నారని ప్రచారం సాగిస్తారు. స్పందించి ఎవరైనా విటులు ఫోన్ చేస్తే, వారిని కూకట్ పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్ వద్దకు రావాలని చెబుతారు. ఆపై ఇద్దరు వ్యక్తులు అతన్ని కలిసి, సమీపంలోని ఓ వేశ్యా గృహానికి తీసుకు వెళతారు. ఆపై నిమిషాల వ్యవధిలో మిగతావారు పోలీసుల వేషాల్లో వచ్చి దాడి చేస్తున్నట్టు నటిస్తారు. అక్కడున్న కస్టమర్లు, మీడియేటర్లు, కాల్ గర్ల్స్ వద్ద ఉన్న మొత్తం డబ్బు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు, ఏటీఎం కార్డులను దోచుకుపోతారు. ముందుగా వేసిన పథకం కాబట్టి, పెద్దగా గొడవ లేకుండానే మిగతావారంతా తమ వస్తువులను వీరికి ఇచ్చేస్తుంటే, విటులుగా వచ్చిన వారూ తమ వస్తువులను అప్పగించి వెళ్లిపోతారు
.
అమిత్ కుమార్ అనే యువకుడు, వీరు దాడి చేసిన వేళ, తప్పించుకుని సమీపంలోని పోలీస్ పెట్రోల్ టీమ్ ను ఆశ్రయించగా, తొలుత ఇద్దరిని, ఆపై నిన్న మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, మియాపూర్ ప్రాంతాల్లోనూ వీరు ఇదే విధమైన దందాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News