: ట్రంప్ తో ఘర్షణ వద్దు: మీడియా ప్రతినిధులకు యాజమాన్యాల సూచనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఘర్షణ వద్దని మీడియా ప్రతినిధులకు ఆయా సంస్థల యాజమాన్యాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన మీడియాతో ఘర్షణకు దిగుతూనే ఉన్నారు. తొలి మీడియా సమావేశంలోనే సీఎన్ఎన్ ను లక్ష్యం చేసుకున్నారు. అంతే కాకుండా మీడియాను తూలనాడుతున్నారు. మీడియా ప్రతినిధులు నిజాయతీ లేనివారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన మీడియా సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నాయి. ట్రంప్ తో ఘర్షణ వద్దని చెబుతున్నాయి.

 వంద దేశాల్లో మీడియా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న రాయ్‌ టర్స్ వార్తా సంస్థ ట్రంప్ దగ్గరకు వెళ్లినప్పుడు ఏం చేయాలో, ఏం చేయవద్దో సూచిస్తూ తమ సిబ్బందికి ఓ నోట్ పంపింది. ఈ సందర్భంగా సహచరులకు రాయ్‌టర్స్ చీఫ్ ఎడిటర్ స్టీవ్ ఏడ్లెర్ ఎన్నో విషయాలు సూచించారు. అలాగే వేగం మంచిదే కానీ అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలకు మేలు చేసే వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని ఆయన సూచించారు. అలాగే వివిధ అంశాలపై సమాచారం పొందే మరిన్ని మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన చెప్పారు. ఏవైనా పుకార్లు వచ్చినప్పుడు అవి వాస్తవమని నిర్ధారించుకున్న తరువాతే ప్రసారం చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా వార్తల్లో సమగ్రత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News