: మహిళపై సర్పంచ్ అమానుష దాడి!

సర్పంచ్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ మహిళపై దారుణంగా దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం జిల్లిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జల్లిపల్లి సర్పంచ్ నాగరాజు.. సుధ అనే మహిళ ఇంటి ఎదుట వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాడు. ఇది తన నివాసంలోకి వెళ్లేందుకు అడ్డుగా ఉందని, వాటర్ ట్యాంక్ ను మరో పక్కన కట్టుకోవాలని ఆమె సూచించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్ నాగరాజు 'నాకే ఎదురు చెబుతావా?' అంటూ ఆమెను నడిరోడ్డుపై కాళ్లతో తన్నుతూ ఆమెపై దాడి చేశాడు.

అతనికి గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ కూడా మద్దతుగా నిలిచి సదరు మహిళపై దాడి చేశాడు. ఈ సంఘటనను ఒకరు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో దీనిని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి, సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ లపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు తెలిపారు. మరోపక్క ఈ వీడియో చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అరెస్టైన నిందితులు బెయిల్ పై బయటకు రావడం విశేషం. 

More Telugu News