: కేవలం అమరావతికే ఎందుకు?...మిగతా భూసేకరణలకు అర్థం లేదా?: సీపీఐ నారాయణ ప్రశ్న

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపును కేవలం అమరావతి రైతులకు మాత్రమే ఎందుకు ప్రకటించిందని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మట్లాడుతూ, బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని చెప్పారు. అలాగే అమరావతిలో భూసేకరణ రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపునిచ్చి ఇతర చోట్ల చేసే భూసేకరణలకు దానిని వర్తింపచేయకపోవడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. భూసేకరణలన్నింటికీ దీనిని వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇతర చోట్ల రైతుల భూసేకరణలకు అర్థం లేనట్టుగా భావించాల్సి వస్తుందని ఆయన అన్నారు. అమరావతితో పాటు పోలవరం, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో భూసేకరణ చేపడుతున్న ప్రాంతంలో రైతులందరికీ దీనిని వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పార్టీల విరాళాలు ప్రకటించడానికి ముందు బీజేపీ నేతల ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయడం ద్వారా పార్టీలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. 

More Telugu News