: భూగర్భంలో అద్భుతమైన లగ్జరీ హౌస్... అణుయుద్ధానికి భయపడ్డ వ్యాపారి నిర్మించుకున్న ఇల్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన రేగుతున్న సంగతి విదితమే.  అయితే, ఎప్పుడో ఒకప్పుడు అణు యుద్ధం వస్తుందని భావించిన ఓ వ్యాపారి మూడు దశాబ్దాల క్రితమే భూగర్భ లగ్జరీ హౌస్ ను నిర్మించుకున్నాడు.1970లో రష్యాతో అమెరికాకు కోల్డ్‌ వార్‌ జరుగుతున్న సమయంలో, అణుబాంబు ప్రయోగాలు జరిగి భూమి సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని అప్పటి ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. దీంతో అమెరికన్లంతా సురక్షిత ప్రాంతాలను చూసుకోవాలని... కొన్నేళ్లకు సరిపడ ఆహార పదార్థాలను దాచుకోవాలని హెచ్చరించింది.

 ఈ సూచనలతో అప్రమత్తమైన గిరార్డ్‌ బ్రౌన్‌ హెండర్సన్‌ అనే వ్యాపారవేత్త వెంటనే భవిష్యత్ కార్యాచరణలో దిగిపోయాడు. అణుబాంబులు పేలినా ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా తన ఇంట్లోనే భూమికి 26 అడుగుల లోతులో లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్‌ రూమ్స్‌, ఒక కిచెన్‌, బాత్రూమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌, లాన్‌ వాటర్‌ ఫాల్‌, గోల్ఫ్‌ కోర్స్‌ ఇలా అన్ని సౌకర్యాలతో ఆ ఇంటిని అత్యద్భుతంగా నిర్మించుకున్నాడు. అంతే కాకుండా భూమి ఉపరితలంపైకి రావాల్సిన అవసరం లేకుండా కొన్నేళ్ల పాటు జీవించేందుకు అవసరమైన సరుకులు కూడా సమకూర్చుకున్నాడు.

 పగలు, రాత్రి మధ్య తేడా తెలిసేలా సమయాన్ని బట్టి వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా లైట్లను ఏర్పాటు చేయించుకున్నాడు. అయితే ఆయన ఊహించినట్టు, లేదా ప్రభుత్వం హెచ్చరించినట్టు అప్పటి కోల్డ్ వార్ తీవ్ర పరిణామాలను చూపలేదు. అయినప్పటికీ ఆయన ఆ భూగర్భంలోని లగ్జరీ హౌస్ లోనే జీవించాడు. 1983లో ఆయన మరణించడంతో ఆ ఇంటిని అతని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2014లో ‘సోసైటీ ఫర్‌ ద ప్రిసర్వేషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎక్సిటిక్ట్‌ స్పీసెస్‌’ అనే సంస్థ ఆ ఇంటిని కొనుగోలు చేసింది.  

More Telugu News