: కదులుతున్న పాకిస్థాన్... హఫీజ్ సయీద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని ప్రకటన!

పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రసంస్థను నిర్వహిస్తున్న హఫీజ్ సయీద్ ను ఇటీవ‌లే అక్క‌డి అధికారులు హౌస్ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. లష్కరే తోయిబాతో పాటు జమాత్ ఉగ్రవాద సంస్థలను నడుపుతున్న ఆయ‌నపై ఎఫ్ఐఆర్‌ నమోదు కానుంద‌ని పాక్‌ ఫెడరల్‌ కామర్స్ మంత్రి ఖుర్రం దస్తగిర్‌ పేర్కొన్నారు. స‌యీద్‌పై ఏ కేసుకింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారనే విషయం మాత్రం చెప్ప‌లేదు. ఆయ‌న‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ఆరోపణలన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

అలాగే త్వరలోనే జమాత్‌ సంస్థకు, ఫలాహ ఈ ఇన్సాన్‌యత్‌(ఎఫ్‌ఈఎఫ్‌)కు చెందిన వారందరినీ అదుపులోకి తీసుకుంటామ‌ని పంజాబ్‌ ప్రావిన్స్‌ న్యాయశాఖ మంత్రి రాణా సనావుల్లా చెప్పారు. తాము త్వరలోనే వారందిరినీ ఉగ్ర‌వాద నిరోధ‌న చ‌ట్టం కింద అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. జాతీయ అవసరాల విషయంలో రాజీపడబోమని స్ప‌ష్టం చేశారు. కశ్మీర్‌ విషయంలో తమ విధానం వేరని, జమాత్‌కు, కశ్మీర్‌కు సంబంధం లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రోవైపు హ‌ఫీద్‌ సయీద్‌ అరెస్టు నేప‌థ్యంలో ఆ దేశంలోని ప‌లు పార్టీలకు చెందిన నేతల్లో విభేదాలు వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది.

More Telugu News