: ‘ఎగ్జిట్’ పరీక్షను ఎత్తివేయాలంటూ గుంటూరు వైద్య విద్యార్థుల ఆందోళన

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎగ్జిట్ పరీక్షను ఎత్తివేయాలని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంబీబీఎస్ తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఎగ్జిట్ పరీక్షతో తీవ్ర ఒత్తిడి తప్పదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో నాలుగేళ్ల ఎంబీబీఎస్ కోర్సుతో పాటు వివిధ నైపుణ్య పరీక్షలు రాస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

మరోపక్క, విద్యార్థుల ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తమ మద్దతు ప్రకటించారు. కాగా, మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రాక్టీసు చేయాలన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా ఎగ్జిట్ పరీక్షను తప్పని సరిగా రాయాలనే నిబంధనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల సిఫారసు చేశాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం నిమిత్తం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

More Telugu News