: రాజకీయ పార్టీని స్థాపించే దిశగా మరో సినీ నటుడు.. లారెన్స్!

దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తమిళనాడుల్లో సినీ నటులు రాజకీయ పార్టీలను నెలకొల్పడం ఎప్పటి నుంచో జరుగుతోంది. వీరిలో కొందరు అఖండ విజయాన్ని సాధించి, రాజకీయాలను శాసించారు. మరికొందరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు అయిన లారెన్స్ రాఘవ కూడా రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని... కానీ, తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగితే పార్టీని స్థాపించడం ఖాయమని చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తి క్లారిటీ లేకపోయినప్పటికీ, పార్టీని స్థాపించాలనే ఆలోచన ఆయన మదిలో గట్టిగా ఉందనే విషయం మాత్రం అర్థమవుతోంది. చెన్నైలో జల్లికట్టు కోసం నిరసనలు జరిగినన్ని రోజులు యువతతో పాటే లారెన్స్ గడిపారు. దీంతో, ఆయనకు 'పెద్దన్నయ్య'గా తమిళ యువతలో భారీ ఇమేజ్ వచ్చింది.

చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన జల్లికట్టులో పాల్గొన్న యువతతో కలసి లారెన్స్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే రాజకీయ పార్టీని స్థాపించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఇప్పటివరకు తాను 135 మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించానని చెప్పారు. 200 మందికి పైగా పేద విద్యార్థులను చదివిస్తున్నానని తెలిపారు. తన ఆశ్రమంలో 60 మంది అనాథలను సంరక్షిస్తున్నానని వెల్లడించారు. జల్లికట్టు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మణికంఠన్ అనే యువకుడి కుటుంబానికి రూ. 10 లక్షల విరాళం అందజేస్తానని ప్రకటించారు.

More Telugu News