: సిటింగ్ ఎంపీ మృతితో బడ్జెట్ రేపటికి వాయిదా?

సిటింగ్ ఎంపీ అహ్మద్ మృతి చెందడంతో నేడు పార్లమెంట్ ముందుకు రావాల్సిన బడ్జెట్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా సిట్టింగ్ ఎంపీ మరణిస్తే, సభను కనీసం ఒకరోజు వాయిదా వేయడం భారత పార్లమెంట్ చరిత్రలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. నిన్న బడ్జెట్ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో కేరళకు చెందిన పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అహ్మద్ కు గుండెపోటు రాగా, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బడ్జెట్ ను వాయిదా వేయాలని కేరళ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఎంపీ అహ్మద్ మృతి దురదృష్టకరమని ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలుపుతున్నట్టు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ మరణించినందున బడ్జెట్ పై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. కాగా, బడ్జెట్ ఉంటుందా? ఉండదా? అన్న విషయమై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

More Telugu News