: ట్రంప్ తదుపరి ఇమిగ్రేషన్ అడుగు... ఈసారి ప్రభావం ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలపైనే!

సిలికాన్ వ్యాలీతో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన పోరు మరింత ఉద్ధృతి కానుంది. ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రయాణికులను, శరణార్థుల రాకను ఆయన నిలిపివేయగా, గూగుల్, ఫేస్ బుక్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఆ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయాలు దేశ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, వినూత్నతకు విఘాతమని ఈ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. టెక్నాలజీ ఆధారిత సంస్థలన్నీ వర్క్ వీసాపై ఆధారపడి వేల సంఖ్యలో ఉద్యోగులను తీసుకు వస్తున్నాయని ఈ కంపెనీలు గుర్తు చేస్తున్నాయి.

ఇక సంస్కరణల పేరిట ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్ సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమేజాన్, యాపిల్ తదితర కంపెనీలపై స్వల్ప ప్రభావం చూపుతుండగా, యూఎస్ లో కార్యాలయాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి కంపెనీలపై పెను ప్రభావాన్ని చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ వేతనాలకు ఇండియా తదితర దేశాల నుంచి నిపుణులైన ఐటీ వర్కర్లను తీసుకువచ్చే అవకాశాలు లేకపోవడం, అధిక వేతనాలు ఇచ్చి అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాల్సి వుండటం యూఎస్ లోని విదేశీ కంపెనీలకు నష్టమేనని అంటున్నారు.

ఈ కంపెనీల్లో ఇప్పుడు వర్క్ వీసాలపై పని చేస్తున్న వారు స్వదేశానికి రాకుండా ఉన్నంతకాలం వారి వీసాలు చెల్లుబాటవుతాయి. ఒకసారి వీసా గడువు ముగిసిన తరువాత దాన్ని పొడిగించుకోవడం చాలా క్లిష్టతరమవుతుందని, ఆ వెంటనే వారు ఉద్యోగాలు వదిలి పోవాల్సి వస్తుందని మానవ వనరుల విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

"మన దేశ ఇమిగ్రేషన్ విధానం అమెరికా జాతి ప్రయోజనాలను కాపాడేదిగా ఉండాలి. తొలుత అమెరికన్లకు లబ్ధిని చేకూర్చేలా వీసాల విధానం ఉంటుంది" అని ట్రంప్ తయారు చేయించిన ముసాయిదా ప్రతిపాదనల్లో ఉన్నట్టు 'బ్లూమ్ బర్గ్' వార్తా సంస్థ ప్రకటించింది. వీసా విధానం మారితే, ప్రస్తుతం అన్ని నిబంధనలు పాటిస్తూ, అమెరికాలో పౌరులుగా, ఉద్యోగులుగా ఉన్నవారందరికీ నష్టం జరుగుతుందని పేర్కొంది. వాస్తవానికి విదేశీ వర్క్ వీసాలు, అమెరికన్ కంపెనీల లాభం కోసం తయారు చేసుకున్నవే. అయితే, మరింత అధిక లాభాలపై కన్నేసిన సంస్థలు, అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్న వారూ లేకపోలేదు.

విదేశీయుల కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయిందన్నది కాదనలేని వాస్తవమని లేబర్ మార్కెట్లపై రీసెర్చ్ చేస్తున్న బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ సీనియర్ ఫెలో గారీ బుర్ట్ లెస్ అభిప్రాయపడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే, అమెరికన్ కంపెనీల ఎదుగుదలకు, మరిన్ని ఉద్యోగాల సృష్టికి విదేశీ నిపుణులు సహకరిస్తున్నారని, వారి కృషితోనే ఎన్నో పేటెంట్లు అమెరికన్ సంస్థలకు దక్కాయని అంగీకరించిన ఆయన, ఈ కారణంగా తమ దేశంలో నిరుద్యోగం పెరగడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారని అన్నారు. ఇక ట్రంప్ తాజా నిర్ణయాల కారణంగా తమకు జరిగే నష్టంపై వ్యాఖ్యానించేందుకు టీసీఎస్, విప్రోలు నిరాకరించగా, ఇన్ఫోసిస్ ప్రతినిధి మాట్లాడుతూ, ట్రంప్ నిర్ణయాలు ప్రస్తుతం ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయని, అవి అమల్లోకి రాకముందే వ్యాఖ్యానాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

More Telugu News