: ట్రంప్ దెబ్బకు కదిలిన పాకిస్థాన్... లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ హౌస్ అరెస్ట్

ఏడు ముస్లిం దేశాలతో పాటు పాకిస్థాన్ పౌరులనూ అమెరికాలో కాలుమోపకుండా నిషేధం విధిస్తామన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వేళ, పాకిస్థాన్ కదిలింది. పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాను నిర్వహిస్తున్న హఫీజ్ సయీద్ ను హౌస్ అరెస్ట్ చేసింది. కనీసం ఆయన్ను ఆరు నెలల పాటు బయటకు రాకుండా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా సంస్థలను నడుపుతున్న హఫీజ్, భారత్ లో ఉగ్రదాడులకు ముష్కరులను పంపుతున్న సంగతి తెలిసిందే. 2008లో ముంబైపై జరిగిన దాడుల వెనుక హఫీజ్ వ్యూహ రచన ఉందని భారత్ ఆరోపిస్తుండగా, సాక్ష్యాలు లేవని పాక్ అతనిపై చర్యలు తీసుకోలేదు.

ఇక పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ జనవరి 27వ తేదీతో హఫీజ్ హౌస్ అరెస్ట్ ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తోంది. లాహోర్ లోని చౌబుర్జీ ప్రాంతంలో హఫీజ్ ఉండగా, అరెస్ట్ చేసిన పోలీసులు ఫైసల్ పట్టణంలోని ఆయన ఇంటికి తరలించామని, ఆయనతో పాటు ఉన్న అబ్దుల్లా ఉబైద్, జాఫర్ ఇక్బాల్, అబ్దుర్ రెహమాన్ అబీద్, ఖాజీ ఖాసిఫ్ నియాజ్ లను కూడా అరెస్ట్ చేశామని పాక్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు, ఉగ్రవాదం అణచివేతకు కదులుతున్న వైనం పాక్ పాలకుల గుండెల్లో గుబులును పుట్టిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.

More Telugu News